Wednesday, 2 January 2019

కళింగ పౌరుషం ( kalinga pourusham) ప్రోత్సాహక బహుమతి పొందిన చారిత్రక కధ -జాగృతి వారపత్రిక

కళింగ పౌరుషం

కళింగ పౌరుషం
క్రీ.పూ. 261వ సంవత్సరం. మగధ సామ్రాజ్య ప్రాభవం ఉచ్ఛ స్థితిలో కొనసాగుతున్న కాలంలో ఓ మిట్ట మధ్యాహ్న సమయం. భోరున కురుస్తున్న వర్షానికి అడవిదారులన్నీ నీటితో నిండి ఉన్నాయి. జోరున వీస్తున్న గాలికి చెట్లన్నీ పూనకం వచ్చినట్టు ఊగుతూ ఉన్నాయి. సేనాదత్తుడు ఆ వర్షాన్ని, గాలిని లెక్కచేయకుండా అశ్వాన్ని వేగంగా తమ రాజ్యం వైపు దౌడు తీయిస్తున్నాడు. అశ్వం అతడి అభీష్టానికి అనుగుణంగా అడవి మార్గంలోని నీటిగుంటలను దాటుకుంటూ, విరిగిపడిన చెట్లకొమ్మలమీంచి లాఘవంగా ఎగురుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. సేనాదత్తుడు కళింగరాజ్యం  గూఢాచారి. మగధ సామ్రాజ్యంలోకి వర్తక వ్యాపారిగా మారువేషంలో ప్రవేశించాడు. పలు ప్రాంతాలలో సంచరించి, గుబులు రేకెత్తించే రహస్యాలను ఛేదించి, నిర్ధారించుకున్నాడు. అంతే… మగధ సామ్రాజ్యాధి నేత అశోకుడు తమ రాజ్యంపై పన్నుతున్న కుట్రకు, వెన్నులో సన్నగా వణుకుపుట్టింది. తమ రాజ్యానికి ముంచుకొస్తున్న పెనుముప్పును ఊహించి, చిగురు టాకులా వణికిపోయాడు. కళింగ ప్రజలకు రాబోయే కష్టాలను తలచుకుని తల్లడిల్లాడు. ఈ కుట్ర విషయం తమ ప్రభువు చెవినవేసి, రాజ్యాన్ని అప్రమత్తం చేయాలని తలంచాడు. తక్షణమే బయలుదేరాడు.
అశ్వం శరవేగంగా పరుగులు తీస్తోంది. ఆ దట్టమైన అడవిలో అక్కడక్కడా కనిపించే క్రూరమగాలను అవలీలగా తప్పించుకుంటూ వెళ్తోంది. ‘ఈ అడవి దాటితే చిన్నపాములను తిని కొండచిలువలా బలిసిన మగధ సామ్రాజ్యం ముగుస్తుంది. సహజసిద్ధమైన ఎత్తైన కొండలూ, గలగల పారే నదులతో శత్రుదుర్భేద్యమైన తమ కళింగ రాజ్యం ఆరంభమౌతుంది. అటు తర్వాత నిర్భయంగా కళింగకోటకు చేరుకోవచ్చు. తమ ప్రభువుకు, అశోకుడి కుయుక్తిని చేరవేయవచ్చు’ అనుకుంటూ సేనాదత్తుడు అశ్వాన్ని మరింత వేగంగా దౌడు తీయిస్తున్నాడు.
అంతలో అతడిని రహస్యంగా వెంబడిస్తున్న మగధ సామ్రాజ్యపు సరిహద్దు కాపాలాదార్లు వదిలిన బాణాలు, అతడి వీపును తూట్లు పొడిచాయి. అతడు అశ్వాన్ని వేగంగా దౌడు తీయిస్తూ, కిందకు ఒరిగి పోయాడు. అతడి దేహం విసురుగా నేలను తాకింది. అశ్వం వాయువేగంతో ముందుకు దూసుకు పోయింది.
భోరున కురుస్తున్న ఆ వర్షంలో సేనాదత్తుడు ఆఖరి శ్వాస తీసుకుంటూ ‘ఓ బుద్ధదేవా!… మగధ సామ్రాజ్యపు బలిష్టమైన కబంధ హస్తాలలో నా కళింగ రాజ్యం నలిగిపోకుండా రక్షించు. సకల జనులను నీవు ఉపదేశించిన శాంతిమార్గం వైపు నడిపించు’ స్వగతంగా అనుకుంటూ ప్రాణాలు విడిచాడు.
—– —— —– —–
ఆ రాత్రి కళింగ ప్రజలు రాబోయే ప్రమాదం గురించి తెలియక ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తెల్లవారడానికి ఇంకా కొన్ని ఘడియలు మాత్రమే ఉన్నాయి. అప్పటికి వర్షం పూర్తిగా తెరిపినిచ్చింది.
రాజధానికి యోజనం దూరంలో ఉన్న పల్లెలోని ఓ గహంలో సేనాదత్తుడి సోదరుడు వజ్రమిత్ర, తన భార్యతో కలిసి గాఢనిద్రలో ఉన్నాడు. అతడికి రెండు మాసాల క్రితమే వివాహమయింది. వ్యవసాయం అతడి వత్తి. యుద్ధ విద్యలంటే అమితాసక్తి. దాంతో అతడు రెండింటిలోనూ ఆరితేరిన ధీశాలి!
అశ్వం సకిలింపులకు ఠక్కున మెలకువ వచ్చింది వజ్రమిత్రకు. బద్ధకంగా శయ్య మీద నుంచి లేచి, బయటకొచ్చాడు. సేనాదత్తుడి అశ్వం, వజ్రమిత్రను చూడగానే సకిలించడం ఆపింది. ఒంటరి అశ్వాన్ని చూసి, వజ్రమిత్ర నివ్వెరపోతూ, అన్నయ్యకోసం చుట్టూ చూశాడు. ఎక్కడా జాడ కానరాక కలత చెందుతూ ఉండగా అశ్వానికంటిన నెత్తుటి చారికలు లీలగా కనిపించాయి. అతడికి వెంటనే తన సోదరుడికేదో ప్రమాదం వాటిల్లిందని అర్థమయ్యి, బాధగా మూలిగాడు. అకస్మాత్తుగా అతడి దష్టి అశ్వం కళ్లెంపై పడింది. సేనాదత్తుడు రహస్య సమాచా రాలను తోలు మీద రాసి ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని కళ్లెంలో ఓ చోట భద్రపరుస్తాడు. ఆ విషయం వజ్రమిత్రకు తెలుసు. అతడు అనుకున్నట్టే, రహస్య సమాచారం కనిపించింది. ఆత్రుతగా తీసి చదివాడు. మరుక్షణం మ్రాన్పడి పోయాడు.
మూడులక్షల కాల్బలం, ఎనభైవేల అశ్వికదళం, తొమ్మిదివేల గజబలం, రెండువేల రథికులతో మగధ సామ్రాజ్యధినేత అశోకుడు కళింగరాజ్యంపై మెరుపుదాడి చేయబోతున్నాడు. సేనాదత్తుడు రాసిన ఆ చేదునిజం వజ్రమిత్రను భయకంపితుణ్ణి చేసింది. స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆనందంగా సాగిస్తున్న కళింగ ప్రజలకు కష్టకాలం సమీపించబోతున్నదని విలపించాడు. ‘అశోకుడి కుయుక్తిని ఛేదించిన అన్నయ్య శ్లాఘనీయుడు. అతడి సాహసాన్ని వథా పోనివ్వకూడదు. తక్షణమే ఈ సమాచారాన్ని తమ ప్రభువుకు చేరవేయాలి. రాజ్యభక్షకుల విషపు కోరల నుంచి రాజ్యాన్ని రక్షించాలి!’ అనుకుంటూ ఉన్నఫలంగా రాజధానికి బయలుదేరాడు.
—– —— —– —–
సభా మందిరం నిశ్చేష్టితమై ఉంది. కళింగరాజు, మహామంత్రి, సర్వసేనాధిపతి, వజ్రమిత్ర, దళపతులు, ఆస్థాన పండితులు, రాజ్యాధికారులు, వివిధ జనపదాల నుంచి విచ్చేసిన పెద్దలూ, ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసి ఉన్నా ఏ ఒక్కరి నోరూ పెగలడం లేదు. రాబోయే ఘోరవిపత్తు నుంచి తప్పించుకోవడమెలాగో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
అరవీర భయంకరుడైన అశోకుడి గురించి అక్కడున్న వారందరికీ తెలుసు… తన తండ్రి బిందుసారుడి అభీష్టం ప్రకారం సుసీముడుకి దక్కాల్సిన రాజ్యాన్ని మంత్రి రాధాగుప్తుడి సాయంతో ఏవిధంగా హస్తగతం చేసుకున్నదీ తెలుసు. పదవీ వ్యామోహంతో తన సోదరులందరినీ రాక్షసంగా, అతిక్రూరంగా చంపించిన విషయమూ తెలుసు… రాజ్యకాంక్షతో పొరుగు రాజ్యాలన్నిటినీ తన సేనల కర్కశ పదఘట్టనలతో నలిపేస్తున్న సంగతీ తెలుసు… వరుస విజయాలతో కన్నూమిన్నూగానక ఘీంక రిస్తున్న మదపుటేనుగనీ తెలుసు… తెలుసు కాబట్టే అక్కడున్న వారందరికీ మతులుపోయి ఉన్నాయి. భయమూ ఆందోళనా ఆపాదమస్తకం ఆవహించి ఉన్నాయి.
అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ కళింగరాజు గొంతువిప్పాడు. ‘ఆ చండాశోకుడి పన్నాగం సేనాదత్తుడి సాహసం వల్ల బయటపడింది. ప్రళయ జంఝామారుతం వంటి ఆ అశోకుడి సేనను తట్టుకుని ఎదురునిలిచే ఉపాయం ఆలోచించండి. మౌనముద్రను వీడి మన కళింగసీమను కాపాడే మార్గాన్ని అన్వేషించండి’ అన్నాడు.
మహామంత్రి తన ఆసనం మీదనుంచి నెమ్మదిగా లేచి ‘ప్రభూ… అశోకుడి పర్జన్య విలయ గర్జనలకు అనేక రాజ్యాలు కకావికలమైనాయి. అతడి పేరు వింటే చాలు రాజ్యాలకు రాజ్యాలే చిగురుటాకులా వణికిపోతున్నాయి. అపజయమెరుగని అతడి శౌర్య పరాక్రమానికి భీతిల్లి దాసోహమంటున్నాయి..’
ఆ మాటలకు అడ్డు తగిలాడు సర్వసేనాధిపతి. మహామంత్రి మాటలను ఖండిస్తూ ‘అమాత్యులవారు సభకు పిరికిమందు నూరిపోయడం భావ్యం కాదు. అసమాన ధైర్యసాహసాలు కలిగిన మన కళింగ సైన్యం ధాటికి, ఇంతకుపూర్వం కయ్యానికి కాలు దువ్విన బిందుసారుడు, తోకముడిచిన విషయం, బహుశా అమాత్యులవారు మరిచినట్టున్నారు’ అన్నాడు.
‘మరువలేదు సేనాని.. కాని అప్పటి మగధ సేన ఇప్పుడు మూడింతలైంది. అశోకుడి నాయకత్వంలో మరింత పదునుదేలింది. కాని మన సేన అప్పటికీ ఇప్పటికీ సంఖ్యాపరంగా అంతే ఉంది. అదీగాక యుద్ధానికి సన్నద్ధంగా లేని మనం, యుద్ధాన్ని అభిలషించటం వథా ప్రయాస! కొరివితో తల గోక్కోవడం క్షేమదాయకం కాదన్నది నా అభిమతం!’ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు మహామంత్రి.
‘అంటే, కళింగరాజ్యాన్ని అశోకుడి పాదాక్రాంతం చేద్దామంటారు. మన ప్రభువుల వారిని మగధకు సామంతరాజును చేద్దామంటారు. కళింగ సైన్యాన్నీ, ప్రజలను బానిసలను చేద్దామంటారు. అంతేనా అమాత్యా!’
‘సేనాని… ఆవేశం అనర్థదాయకం. నిదానంగా ఆలోచించు… యావత్‌ భారతాన్ని గడగడలాడిస్తున్న అశోకుడి ముందు మన బలం, బలగం ఏమాత్రం సరిపోదన్న సత్యం బోధపడుతుంది. సైన్యాన్నీ, ప్రజలను బలిపెట్టడం తప్ప, యుద్ధం వల్ల ఎట్టి ప్రయోజనమూ లేదు. కాలం కలిసివచ్చేవరకూ తగ్గి ఉండడమే శ్రేయస్కరం’
వజ్రమిత్ర సభ ముందుకొచ్చి ‘ప్రభూ…కళింగ సైన్యమూ, కళింగ ప్రజలు చావుకి భయపడే పిరికిపందలు కారు. వారు స్వతంత్ర జీవనాన్ని కోరుకునే అభిమానవంతులు. పరాయి పాలనలో బానిసలుగా బ్రతకడం కంటే పోరాడి చావడానికైనా సిద్ధపడే ధీరులు. తమ మట్టిని కాపాడుకోవడం కోసం, ఆ మట్టిలో కలిసిపోవడానికైనా వెనుకాడని సాహసవీరులు. ప్రభూ… తమరు ఆజ్ఞాపించాలేగానీ యుద్ధ విద్యలలో ఆరితేరిన మన కళింగ ప్రజలు జీత భత్యాలతో ప్రమేయం లేకుండా మహదా నందంగా సైన్యంలో చేరతారు. ఇప్పుడున్న మన సైన్యాన్ని తక్షణమే పదింతలు చేస్తారు. వారు ప్రచండ వాయువులై, కమ్ముకొచ్చే కారు మేఘాలను చెల్లా చెదురు చేస్తారు. ఆనకట్టలై, దూసుకొచ్చే జల ప్రళయాన్ని అడ్డుకుంటారు. అంకుశాలై, మదపు టేనుగుల మదం అణుస్తారు’ అన్నాడు ఆవేశంగా.
ఆ వెంటనే ఓ వద్ధుడు లేచి ‘ప్రభూ… వజ్రమిత్ర చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. తమరు అనుమతిస్తే యుద్ధవిద్యను అభ్యసించిన నా ముగ్గురు కుమారులను సైన్యంలో చేరుస్తాను. తాటాకు చప్పుళ్లకు భయపడకండి. కళింగరాజ్యం జోలికొస్తే పరాభవం తప్పదని ఆ అశోకుడికి గట్టి హెచ్చరిక చేయండి’ అన్నాడు.
సభలో ఉన్నవారంతా సర్వసేనాధిపతి, వజ్రమిత్ర, వద్ధుడు అన్న మాటలను గట్టిగా బలపరిచారు. మాతభూమి పరిరక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ముక్తకంఠంతో నినదించారు.
కళింగరాజు అందరినీ శాంతింపజేసి ‘మీ అందరిలోనూ కళింగపౌరుషం ఉట్టిపడుతోంది. కోపాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఆ జ్వాలలు రాజ్యమంతా ప్రజ్వరిల్లితే మగధ సైన్యం కాలి బూడిదవుతుంది. గడ్డిపరకలన్నీ ఏకమైతే మదగజాన్ని బంధించగలవు. మన కళింగ వీరులంతా దీక్షబూనితే ఆ చండాశోకుడి దురహంకారాన్నీ, నిరంకుశత్వాన్ని మట్టిలో కలపొచ్చు. తక్షణమే యుద్ధానికి సన్నద్ధం కండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం. మనపై కత్తి దూస్తున్న వారి కుత్తుకలను ఖండించో, స్వేచ్ఛా స్వతంత్య్రం కోసం పోరాడి నేలరాలో చరిత్ర పుటల్లో నిలిచిపోదాం’ అన్నాడు ఉగ్రంగా.
ఆ సభలో ఉన్న వారందరినీ యుద్ధానికి సిద్ధం కమ్మని ఆజ్ఞాపించాడు. ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రేకెత్తించే బాధ్యతను వజ్రమిత్రకు అప్పగించి, సభ ముగించాడు.
—– —— —– —–
కళింగరాజు తనపై వేసిన భారాన్ని సమర్థ వంతంగా నిర్వర్తించాడు వజ్రమిత్ర. దీక్షాబద్ధులైన రెండువందల మంది యువకుల సహాయంతో, అశోకుడి దండయాత్ర వార్త కళింగరాజ్యమంతా వ్యాపింపజేశాడు. ప్రజలలో పోరాట స్ఫూర్తిని రగిలించాడు. దాంతో అందరిలోనూ రాజ్యాభి మానం, ఆత్మాభిమానం పెల్లుబికింది. మగధ సామ్రాజ్యంపై ఆవేశం, ఆగ్రహం కట్టలు త్రెంచుకుంది. రాజ్యంలోని రహదారులన్నీ పోరాట వీరులతో కిక్కిరిసి పోయాయి. సైన్యంలో చేరడానికి ఆయుధాలు చేతబూని కొందరు, సైన్యానికి సహాయం అందించడానికీ, ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని తమ విరాళాలతో ముంచెత్తడానికి మరికొందరు వెల్లువలా రాజధానికి సాగుతున్నారు. చావో రేవో తేల్చుకోవ డానికి వీరావేశంతో ముందుకు కదులుతున్నారు.
ఎప్పటికప్పుడు వేగుల ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకుంటున్న కళింగరాజు మహదానందంగా ఉన్నాడు. ఘడియ ఘడియకు సైన్యం బలోపేత మవుతున్న విషయం, సర్వసేనాధిపతి నోటివెంట విని ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాడు. అంతలో ఓ వేగు తెచ్చిన సమాచారం అతడిని స్థాణువుడిని చేసింది. అఖండమైన సైన్యంతో అశోకుడు కళింగ రాజ్యంలోకి దౌర్జన్యంగా చొరబడ్డాడన్న ఆ వార్త, కాస్త ఆందోళన కలిగించింది. నైరాశ్యాన్ని తెప్పించింది. వెంటనే మహామంత్రిని పిలిపించి సమాలోచనలు జరిపాడు.
‘మహామంత్రి… మగధసేనను మనసేన ఢీకొట్టగలదా? అన్న శంక నన్ను పట్టిపీడిస్తున్నది. కళింగ ప్రజల ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి మనం యుద్ధానికి దిగడం న్యాయమా?’ సందిగ్ధంగా అడిగాడు కళింగరాజు.
‘మహారాజా…. ఒక్కసారి ఏకాంత మందిరం వీడి బయటకు రండి. జనసముద్రాన్ని చూస్తే, నా లాగే తమరి శంక కూడా పటాపంచలవుతుంది. వజ్రమిత్ర ప్రజలలో రగిలించిన స్వేచ్ఛా స్వాతంత్య్ర జ్వాల తమరికి తేటతెల్లమవుతుంది. ప్రజలు అగ్గి బరాటాల్లా మండిపోతున్నారు. ఒక్కొక్కరూ పదిమంది శత్రు సైనికులను మట్టుబెట్టేటంతటి క్రోధావేశంతో రగిలిపోతున్నారు. వారు యుద్ధాన్ని తప్ప, బానిసత్వాన్ని వాంఛించడంలేదు. తమరి పాలనను తప్ప, పరాయి పాలనను కోరుకోవడం లేదు. మహారాజా… తమరు అధైర్యం వీడండి. సమర శంఖం పూరించండి’ అన్నాడు మహామంత్రి.
మహామంత్రి మాటలు వెయ్యేనుగుల బలాన్నిచ్చాయి కళింగరాజుకు. ‘మహామంత్రి… రాధాగుప్తుడు యుద్ధతంత్ర నిపుణుడని విన్నాను. అతడి తంత్రాలను, అశోకుడి ఎత్తులను చిత్తుచేసే తగిన యుద్ధవ్యూహాలను సిద్ధం చేయండి’ అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా.
—– —— —– —–
సాయంసంధ్యా సమయం. ఆ ప్రాంతం కొద్దిరోజుల ముందు దయానది పరవళ్లతో, పక్షుల కూతలతో, వన్యమగాల అరుపులతో సందడి సందడిగా ఉండేది. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఏనుగుల ఘీంకారాలతో, అశ్వాల సకిలింపులతో, సైనికుల అరుపులతో గందరగోళంగా ఉంది.
దయానది దిగువ ప్రాంతంలో అశోకుడి సైనిక శిబిరం వద్దకు చేరుకున్నాడు వజ్రమిత్ర. అశోకుడు, కళింగరాజును లొంగిపొమ్మని దూత ద్వారా సందేశం పంపాడు. అందుకు ప్రతిగా గట్టి హెచ్చరిక చేసి రమ్మని తన దూతగా వజ్రమిత్రను పంపించాడు కళింగరాజు.
వజ్రమిత్ర ఓ సైన్యాధికారి వెంట అశోకుడి గుడారం వైపు నడుస్తూనే అక్కడి పరిసరాలను ఓరకంట గమనిస్తున్నాడు. అసంఖ్యాకంగా ఉన్న అశ్వాలూ ఏనుగులూ, ఇసుకేస్తే రాలనంతగా కనిపిస్తున్న సైన్యం, కనుచూపు మేర వరకూ కనిపిస్తున్న లెక్కలేనన్ని గుడారాలూ అతడికి మతిపోగొడుతున్నాయి. వారి ఆయుధ సంపత్తి విస్మయపరుస్తున్నది. వారి బలాన్ని మదిలో అంచనా వేస్తూ ఉండగానే అశోకుడు విడిది చేసిన గుడారం వచ్చింది.
అశోకుడు నగిషీలు చెక్కిన ఆసనం మీద ఠీవిగా ఆశీనుడై ఉన్నాడు. అమూల్య ఆభరణాలు ధరించిన అతడిలో రాజసం ఉట్టి పడుతోంది. చిరునవ్వులు చిందిస్తున్న అతడి కోమలమైన ముఖం, అతడు రాజ్యదాహంతో తన సోదరులను చంపించాడంటే నిజమనిపించనివ్వడం లేదు. కరుణను కురుపిస్తున్న అతడి కళ్లు, అతడో యుద్ధోన్మాది అంటే నమ్మబుద్ది కానివ్వడంలేదు.
వజ్రమిత్ర అశోకుడికి ప్రణామం చేసి ‘మహా రాజా! మా ప్రభులవారి అనుజ్ఞ లేకుండా కళింగ రాజ్యంలోకి చొచ్చుకురావడం న్యాయ సమ్మతం కాదు. తక్షణమే రాజ్యం విడిచి వెళ్లడం తమరికీ, తమరి సైన్యానికీ క్షేమదాయకం. కాదూ కూడదని యుద్ధానికి దిగితే తమరి రాజ్యకాంక్షకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. తమరికిదే అంతిమ యుద్ధమవుతుంది. ఇది మా ప్రభువులవారి హెచ్చరిక!’ అన్నాడు మెత్తగా.
మంత్రి రాధాగుప్తుడు కోపాన్ని అణుచుకుంటూ ‘దూతవని క్షమిస్తున్నా, ఏమిటా పిచ్చి ప్రేలాపనలు? మీ బెదిరింపులకు పారిపోయే కుందేళ్లం కాదు మేం! కళింగ పాలిట యమకింకర్లం! మర్యాదగా కళింగను మా ప్రభువుల వారి పాదాక్రాంతం చేస్తే సరి. లేదా రక్తపుటేర్లు ప్రవహింపజేసి, కళింగను మా హస్తగతం చేసుకుంటాం’ అన్నాడు.
ఆ వెంటనే అశోకుడు చిరుమందహాసంతో ‘మా అశేష సేనావాహినికి భీతిల్లి రాజ్యాలకు రాజ్యాలే మాకు దాసోహమవుతుంటే, మీ ప్రభువు ఏ ధైర్యంతో మాతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు’ ఉత్సుకతగా అడిగాడు.
వజ్రమిత్ర తడబాటు లేకుండా ‘మహారాజా! కళింగులు మాతభూమి పరిరక్షణకు కంకణ బద్ధులు… బానిసత్వాన్ని తిరస్కరించే సాహస యోధులు… స్వేచ్ఛకోసం పరితపించే ధీరులు… ఈ లక్షణాలే మా ప్రభువుకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. వారి గుండె ధైర్యం, చావుకు తెరువని మొండిధైర్యం మా ప్రభువును యుద్ధోన్ముఖుడిని చేశాయి. మహారాజా! తమరు వెనుదిరిగితే కళింగులు కతజ్ఞతలు ప్రకటిస్తారు. లేకుంటే సింహస్వప్నా లౌతారు. నిర్ణయం తమరిదే!’ కాస్త ఆవేశంగా అన్నాడు.
అతడి సమాధానం విని అశోకుడు ఒక్కసారిగా ఖిన్నుడైనాడు. రాధాగుప్తుడు ఆశ్చర్యచకితుడైనాడు. వజ్రమిత్ర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమైనాడు.
—– —— —– —–
దయానది ఎగువ ప్రాంతం యుద్ధభూమికి వేదికయింది. ఇరుప్రక్కల లక్షలాది చతురంగబలాలు వారి వారి వ్యూహాల ప్రకారం మోహరించాయి. రథ, గజ, అశ్వ, పదాతి దళాలు చేస్తున్న ఘోషతో అష్ట దిక్కులూ మారు మ్రోగుతున్నాయి. వారి పదఘట్టనలతో రేగుతున్న దుమ్మూ, ధూళీ ఆకాశాన్ని అంటుతున్నాయి.
కళింగరాజు తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఒక భాగాన్ని తన కింద, రెండోవది మహామంత్రి కింద, మూడోవది సర్వసేనాధిపతి కింద ఉంచాడు. వజ్రమిత్రను తన అంగరక్షకుడిగా నియమించాడు. కళింగ సేన యుద్ధభేరి మ్రోగగానే ఉప్పెనలా ఎగిసిపడడానికి సిద్ధంగా ఉన్నారు. తమ స్వేచ్ఛను హరించాలని చూస్తున్న శత్రు సేనను చీల్చి చెండాడాలనే వీరావేశంతో ఉన్నారు. తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న వారి అహం కారాన్ని అంతమొందించాలన్నంత ఆగ్రహంతో ఉన్నారు.
కళింగరాజు తన సేనను ఉద్దేశించి ‘సైనిక యోధుల్లారా! కళింగ పౌరుషాన్ని ప్రదర్శించండి. శత్రుసేనకు ప్రాణభయాన్ని రుచి చూపండి. కళింగులు మహావీరులనీ, సాహసానికి మారు పేరని నిరూపించండి. విజయమో, వీరమరణమో మన చెంతకొచ్చేవరకూ అవిశ్రాంతంగా పోరాడండి’ బిగ్గరగా అన్నాడు.
ఆ వెంటనే వజ్రమిత్ర ఆవేశపూరితంగా ‘స్వేచ్ఛా?… మరణమా?..’ అంటూ గట్టిగా ఎలుగెత్తి అరిచాడు. లక్షలకంఠాలు దిక్కులు పిక్కటిల్లేలా ‘స్వేచ్ఛా?… మరణమా?’ అంటూ మేఘగర్జనలలా నినదించారు.
కళింగసేన రణనినాదం ప్రళయనాదంలా వినిపించి మగధసేనకు గుండెలదిరాయి. భయం అణువణువునా వ్యాపించింది. కొన్ని ఏనుగులూ అశ్వాలూ బెదిరి సైన్యాన్ని తొక్కుకుంటూ వెనక్కి పరుగందుకున్నాయి. యుద్ధం మొదలు కాకుండానే ఆ తొక్కిడిలో నలిగి కొంత సైన్యం యమపురికి చేరుకుంది. దాంతో అశోకుడు క్రోధావేశంతో రగిలిపోతూ యుద్ధభేరి మ్రోగించాడు. అందుకు ప్రతిగా కళింగ భేరీలూ మ్రోగాయి.
ఇరు సైన్యాలు పందెపుకోళ్లులా కలయబడ్డాయి. నెత్తురు చిందడం మొదలైంది. రధికులూ, ఏనుగులపై నున్న హౌడాలులోని ధనుర్ధారులూ శత్రువులపైకి వెదురుబాణాలను సంధిస్తున్నారు. అశ్వికులు తమ కరవాలాలతో శిరస్సులను ఖండిస్తున్నారు. పదాతులు బల్లెలతో గుండెలను చీలుస్తున్నారు. పోరు ఘోరంగా సాగుతున్నది. ఆ రోజు, ఆ మర్నాడు, ఆ తర్వాతి రోజు… రోజులు కరుగుతున్నా యుద్ధం ఆగడంలేదు. ఎవరిది పైచేయో తెలియడం లేదు. మగధ సైన్యం కండబలాన్ని చూపిస్తోంది. కళింగసైన్యం సాహసాన్ని ప్రదర్శిస్తోంది. ఫలితంగా విజయం ఇరుపక్షాలను ఊరిస్తోంది. భారీగా జరుగుతున్న ప్రాణనష్టం, ధననష్టం భయపెడుతోంది.
ఆ రాత్రి అశోకుడు, తన మంత్రులూ సేనాధి పతులతో సమావేశమయ్యాడు. యుద్ధం సష్టిస్తున్న విధ్వంసం అతడిలో కొత్త తలపులను ప్రోది చేస్తున్నాయి. శాంతిని ప్రేరేపిస్తున్నాయి. అహింసవైపు అడుగులు వేయిస్తున్నాయి. దాంతో అతడు యుద్ధాన్ని ఇంతటితో విరమిద్దామని ప్రకటించాడు. అందుకు అక్కడున్న వారంతా విముఖత చూపారు. అలా చేస్తే మగధ సామ్రాజ్యం, కళింగుల వీరత్వానికి మోకరిల్లి నట్టవుతుందన్నారు. దేదీప్యమానంగా వెలుగొందు తున్న మగధ కీర్తి ప్రతిష్ఠలు మసక బారతాయన్నారు. చివరిగా మంత్రి రాధాగుప్తుడు ‘ప్రభూ! తమరిలో కొత్తగా మొలకెత్తుతున్న ఆ శాంతి మొలకను చిదిమేయండి. లేకపోతే అది మన బలహీనతగా, కళింగులకు వెయ్యేనుగుల బలంగా మారుతుంది. తమరు ఒక్కరోజు ఓపిక పడితే యుద్ధానికి ముగింపు పలుకుతాం. తమరి తండ్రి బిందుసారుడికి దక్కని విజయాన్ని తమరి పాదాక్రాంతం చేస్తాం!’ అన్నాడు నచ్చజెప్పుతూ. దాంతో అశోకుడు అన్యమనస్కంగానే ఊకొట్టాడు.
ఆ మరునాడు యుద్ధం తిరిగి ప్రారంభమైంది. మగధ సైన్యం తమ మంత్రులూ, సేనాధిపతులు రూపొందించిన వ్యూహం ప్రకారం నడుచుకుంటూ, యుద్ధ నియమాలను గాలికొదులుతూ అధర్మయుద్ధం సాగిస్తున్నారు. దొంగదెబ్బ తీస్తూ మారణ¬మాన్ని సష్టిస్తున్నారు. ఊహించని విధంగా దాడిచేసి దారుణంగా, రాక్షసంగా కళింగులను వధిస్తున్నారు. కళింగులు అది గుర్తించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కళింగసేన పూర్తిగా చెల్లాచెదురైంది. చెదిరిన సేనను మట్టుబెట్టడం మగధ సేనకు సునాయాసమైంది.
వ్యూహాత్మకంగా దాడిచేసి కళింగరాజును గాయ పర్చిన మగధ సైన్యాన్ని వీరోచితంగా ఎదురుకున్నాడు వజ్రమిత్ర, కళింగరాజును సురక్షిత ప్రదేశానికి పంపించి, శత్రుమూకపై నెత్తురు రుచి మరిగిన సింహంవలె వీర విహారం చేస్తున్నాడు. అంతలో ఓ సైనికుడు దొంగచాటుగా అతడి అశ్వాన్ని గాయ పర్చాడు. దాంతో అది గట్టిగా సకిలిస్తూ నేలకూలింది. దానితోపాటుగా వజ్రమిత్ర కూడా నేలపై పడ్డాడు. అదే అదునుగా శత్రు సైనికులు కలయబడి అతడి రెండు కాళ్లనూ కర్కశంగా ఖండించారు.
కాలం గడుస్తున్నకొద్దీ యుద్ధం ఏకపక్షమైంది. కళింగసైన్యం పల్చబడింది. మగధ సైన్యం ఉన్మా దుల్లా కనిపించిన కళింగవీరుల శరీర భాగాలను సొరకాయను కోసినట్టు కోశారు. రాజధానిపై, సమీప గ్రామాలపైబడి వద్ధులనీ, స్త్రీలనీ, పిల్లలనీ చూడక నరమేధం సష్టించారు. అందినకాడికి దోచుకున్నారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. ఎందర్నో యుద్ధఖైదీలుగా బంధించారు. సూర్యాస్తమయానికి యుద్ధాన్ని పరిసమాప్తం చేశారు.
—– —— —– —–
నెమ్మదిగా చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. ఆకాశంలో వందల సంఖ్యలో రాబందులు చక్కర్లు కొడుతున్నాయి. అశోకుడి శిబిరంలో పండుగ వాతావణం నెలకొంది. అందరి ముఖాలలోనూ ఆనందోత్సహాలు వెల్లువిరుస్తున్నాయి. కాని అందుకు విరుద్ధ భావాలు అశోకుడి ముఖంలో ప్రస్ఫుట మవుతున్నాయి. అతడి హదయం పశ్చాత్తాపమనే అగ్నితో దహించుకుపోతోంది. ఆ అగ్నిని చల్లార్చు కోవడం కోసం దయానది వద్దకొచ్చిన అశోకుడు స్థాణువయ్యాడు. దయానది, నీళ్లకు బదులుగా నెత్తురును ప్రవహింపజేస్తున్నది. అశోకుడి మనసు వికలమైంది. వడివడిగా శిబిరానికి తిరిగివచ్చి, అశ్వంపై యుద్ధభూమికి చేరుకున్నాడు.
అశోకుడి చేతిలో ప్రజ్వరిల్లుతున్న దివిటీ అక్కడి భయానక దశ్యాన్ని ఆవిష్కరిస్తున్నది. ఎక్కడచూసినా శవాల గుట్టలూ, రక్తపు మడుగులు కనిపిస్తున్నాయి. విగత జీవులైన ఏనుగులూ, అశ్వాల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. తెగిపడిన తలలూ, మొండాలూ, కాళ్లూచేతులూ, మాంసపు ముద్దలతో అక్కడ మత్యువు రాజ్యమేలుతున్నట్లుంది. క్షతగాత్రుల ఏడుపులు, కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారి మూలుగులు హదయాన్ని మెలితిప్పుతున్నాయి. యుద్ధభూమి భయోద్విగ్నంగా, బీభత్సంగా, జుగుప్సాకరంగా ఉంది.
శవాలనూ, క్షతగాత్రులను తప్పించుకుంటూ అశ్వాన్ని ముందుకు పోనివ్వడం అశోకుడికి కష్టమైపోయింది. శవాలను పీక్కుతింటున్న క్రూర మగాలను చూసి గుండె నీరైపోయింది. అతడిలో ఆత్మశోధన ప్రారంభమయింది.
ఎన్నడూ కనీవినీ ఎరుగని ఇంతటి అమానుష కాండ నా ఒక్కడి వల్లనే జరిగిందా? నేనేనా ఈ ఘోరకళికీ, జన విధ్వంసానికి కారణమూ? స్వేచ్ఛా స్వతంత్రాల కోసం సాహసమనే ఆయుధాన్ని పట్టిన కళింగుల మీదా నా శౌర్య పరాక్రమాలను ప్రదర్శిం చింది? ఒక వ్యక్తి రాజ్యకాంక్ష, యుద్ధదాహమూ ఇంతటి వినాశనాన్ని సష్టిస్తుందా? ఇందరి ప్రాణాలనూ, క్షతగాత్రులనూ కోరుకుంటుందా? శోకమే ఎరుగని అశోకుడు శోకసంద్రమే అయ్యాడు.
రక్తపు మడుగులో, చావుకు చేరువలో ఉన్న వజ్రమిత్ర, తన సమీపంలోకి వచ్చిన అశోకుడిని చూశాడు. చిన్నగా మూలిగాడు. అశోకుడు కళింగ దూతను గుర్తుపట్టాడు. ఒక వీరుడి దీనస్థితికి చలించిపోయాడు.
‘మహారాజా! దివిటీ వెలుగులో తమరు పారేసుకున్న దేనినో శవాల గుట్టల మీద గాలిస్తు న్నారు. ఒకవేళ మానవత్వాన్నీ, శాంతిని కాదు కదా? అవే అయ్యింటే, అవి ఇక్కడెందుకు దొరుకు తాయి మహారాజా.. తమరి హృదయాంతరాలలో వెదకండి. తప్పక దొరుకుతాయి. అప్పుడు కళింగుల సాహస గాధ తమకో గుణపాఠమవుతుంది. ఈ కళింగ యుద్ధమే తమరికి అంతిమ యుద్ధమవుతుంది. గౌతమబుద్ధుడి శాంతి ప్రభోదమే ఆయుధమవుతుంది’ అంటూ వజ్రమిత్ర తుదిశ్వాస వదిలాడు.
అశోకుడు పశ్చాత్తాపంతో అక్కడ్నుంచి కదిలాడు. వజ్రమిత్ర మాటలు పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అమర వీరులైన కళింగుల ముఖాలలో పౌరుషాగ్ని జ్వాలలు ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. అవి అతడిలోని కామక్రోధమదమాత్స ర్యాలను దహిస్తున్నాయి. అతడిలోకి ప్రేమ, కారుణ్యాలను ప్రవేశపెడుతున్నాయి.
అశోకుడు… కళింగుల ఆత్మార్పణకూ, సాహసానికి జోహార్లు అర్పిస్తూ… యుద్ధాలకు చరమగీతం పాడుతూ… శాంతికి, అహింసకు హదయ కవాటాలను తెరుస్తూ… నవోదయానికి స్వాగతం పలుకుతూ… ముందుకు సాగుతున్నాడు.
(చరిత్రలో నిజంగా జరిగిన కళింగ యుద్ధ నేపథ్యంలో అశోకుడి సేనను, కళింగులు ఏ విధంగా ఎదిరించి ఉంటారో ఊహించి రాసిన కల్పిత కథ. ఈ కథలోని పలు సంఘటనలు, ప్రదేశాలు వాస్తవాలు. అశోకుడు, రాధాగుప్తుడు, బిందుసారుడు, సుసీముడు పేర్లు వాస్తవాలు. కళింగరాజు పేరు చరిత్రలో అలభ్యం. మిగిలిన పేర్లన్నీ కల్పితాలే)
– బోడ్డేడ బలరామస్వామి

No comments:

Post a Comment