Wednesday 2 January 2019

శ్రీకాళింగము-శ్రీకాకుళము

Historical Srikakulam & Uttarandhra Places:

సుదీర్ఘ సముద్రతీరం.. అపారమైన ప్రకృతి వనరులు... క్రీస్తుపూర్వం నాటి ఘనమైన చరిత్ర.. అతి ప్రాచీన... అత్యంత అరుదైన దేవాలయాలు...
బౌద్ధారామ క్షేత్రాలు.. ఇదీ శ్రీకాకుళం జిల్లా స్వరూపం ~~~~
ఇదో అందమైన వూటీ... పేదల వూటీ... వేసవిలోనూ చల్లదనం చూపించే జిల్లా ఇది. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదుల సాగర సంగమ ప్రదేశాలు మనసును పరవశింపచేస్తాయి.
మరో కోనసీమను తలపించే ఉద్దానం.. నిజంగా స్వర్గధామమే. శాలిహుండం, కళింగపట్నం, దంతవరపు కోట ఆనాటి కళింగ ప్రజల శాంతికాముకత్వానికి ప్రతీకలుగా నిలిచాయి.
శ్రీకాకుళం పట్టణానికి ఆనుకుని ఉన్న సూర్యదేవాలయం, శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథుడి ఆలయం, దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర, మధుకేశ్వర దేవాలయాలు, ఒకనాడు పాండవులు నివసించిన తూర్పు కనుమల్లోనే ఎత్తైన శిఖరాలుగా పేరుగాంచిన మహేంద్రగిరులు...
విదేశీ విహంగాలకు ఆటపట్టయిన తేలినీలాపురం, తేలుకుంచి, ప్రాచీన కాలంలో ఓడరేవులుగా విలసిల్లిన కళింగపట్నం, బారువలు శ్రీకాకుళం జిల్లాలోని విభిన్న కోణాలను స్పృశిస్తాయి.
శతాబ్దాల చరిత-చిక్కోలు ఘనత-
ప్రాచీనకాలంలోనే శ్రీకాకుళం ఉందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. అయితే 1950లో జిల్లాలు ఏర్పడనంత వరకు ఈ ప్రాంతాన్ని కళింగ ప్రాంతంగా వ్యవహరించేవారు.
కళింగ చరిత్ర ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, మహాభారతం, కథా సరిత్సాగరం, మొదలైన గ్రంథాలలో ప్రస్తావించారు. పూర్వదశలోనే ఈ ప్రాంతంలో ఆదిమ తెగలతో కూడుకున్న జనజీవనం ఉన్నట్టుగా కంభంపాటి సత్యనారాయణ ఆంధ్రుల సంస్కృతి-చరిత్రలో పేర్కొన్నారు. శబ్దకల్ప ద్రుమంలో కలి+గయ్‌+డ అని కళింగ ఉత్పత్తి పేర్కొన్నారు. వివాదాలు జరిగే ప్రదేశాలు కనుక దీనికి ‘కళింగ’ ప్రదేశమని వచ్చిందని కళింగ చరిత్రలో వివరించారు.
‘రామాయణం’లో అయోధ్యకాండలో భరతుడు కేకేయరాజును వదిలి అయోధ్యకు వచ్చేటప్పుడు కళింగనగరం మీదుగా ప్రయాణించాడని చెప్పినట్టు ప్రాచీన చరిత్ర-భూగోళంలో పేర్కొన్నారు.
ఈ ప్రాంతానికి సంబంధించి అయోధ్యకు పశ్చిమంగా కళింగనగరం ఉన్నట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది. భారతంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో భ్రాతృభిస్సహితో వీరఃకలింగాన్‌ ప్రతిభావతి అని చెప్పిన దాని ప్రకారం అప్పటికే ఈ కళింగ ప్రాంతం ఉన్నట్టు తెలుస్తోంది. దీర్ఘతమనుడు అనే రుషిని కాళ్ళు, చేతులు కట్టి అతని శిష్యులు గంగలో వదిలివేశారు.
అతడు నీటిలో కొట్టుకురాగా ‘బిలి’ అనే రాజు అతనిని ఇంటికి తీసుకెళ్లి సంరక్షణ చేసి తన భార్యతో సంతానాన్ని కనాలని కోరడంతో ఆ రుషి ఆమె ద్వారా ‘అంగుడు’, ‘వంగడు’ ‘కళింగుడు’, ‘సహ్ముడు’ అనే పుత్రులను కన్నాడని ఆ పుత్రుల వల్ల వారి పేర్ల మీదుగా రాజ్యాలు ఏర్పడ్డాయని మహాభారతంలో ఉంది.
దండి రాసిన దశకుమార చరిత్రలో కళింగ దేశం, కళింగనగరంగా పేర్కొన్నారు. మార్కండేయ పురాణం, వాయు పురాణం, కాళిదాసు రఘువంశంలో కూడా ‘కళింగం’ ఉనికిని ప్రస్తావించారు.
మన్మోహన్‌ గంగూలీ ‘ఒరిస్సా దాని చిహ్నములు’ అనే గ్రంథంలో కాళింగమునకు ఉత్తరమున వైతరణి నది, దక్షిణాన గోదావరి, తూర్పున సముద్రం, పశ్రిమాన ఒరిస్సా రాష్ట్రాలున్నాయని చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ కళింగం అతి ప్రాచీనమైనదని చెప్పవచ్చు. కళింగ ప్రాంతాన్ని గురించి శ్రీముఖలింగంలో లభించిన శాసనాలు, శక్తివర్మ రాగోలు శాసనాలలో మనకు మరింత సమాచారం దొరుకుతుంది.
బ్రిటీషుపాలనలో ఉన్నప్పుడు గోదావరి నది వరకు ఉన్న ఈప్రాంతమంతా ఒరిస్సాగా పిలువబడేది, ఆ సమయములో [క్రీ.శ.1857 నుంచి 1890మధ్య], 80 కి పైగా తామ్ర శాసనాలు[Copper Plates] ఒరిస్సాలోని భువనేశ్వరము వద్దగల "కళింగనగర్" లో పొందుపరుచబడినాయి. ఇందుముఖ్యమైన దక్షిణ కళింగము లేదా నేడు ఉత్రరాంధ్రగా పిలువబడుతున్న శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్టణము, తూర్పుగోదావరి జిల్లా లకు చెందిన 80 తామ్రశాసనాలు Orissa Inscriptions పేరున ఉన్నాయి.
ఇందు ముఖ్యమైనవి కొన్ని: శ్రీముఖలింగము శాసనము, కొర్ని శాసనము, పాతటెక్కలి శాసనము, గార శాసనము, వైజాగపటము శాసనము మొదలైనవెన్నో ఒరిస్సా కళింగనగర్లోనే ఉంచబడినాయి.
శ్రీకాకుళముజిల్లాకు చెందిన క్రీ.శ. 1026 నాటి చినబాడము, నందబలగ తామ్ర శాసనాలు[Copper Plates] రెండున్నూ ఆంధ్రవిశ్వవిద్యాలయము చరిత్రవిభాగము[Archaelogy]లో 1960 లలో నిక్షిప్తము చేయబడ్డాయి.
ఈ శాసనాల పరంగా పరికిస్తే జిల్లా అతిప్రాచీనమైనదని అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో క్రీ.పూ. నాల్గవ శతాబ్దం నాటికే కళింగ రాజ్యం కటక్‌ నుంచి పిఠాపురం వరకు వ్యాపించి ఉంది. అప్పటి నుంచి 15వ శతాబ్దం వరకు అనేక మంది రాజులు, దండయాత్రలు జరిపి తమ తమ రాజ్యాలను స్థాపించారు.
మహ్మదీయ పాలనలో కూడా తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చారు. కాలానుగుణంగా కళింగ రాజ్యం ఉత్తర భాగం ఒరిస్సాలోను, దక్షిణభాగం ఆంధ్రలోను అంతర్భాగం అయ్యాయి. క్రీ.పూ. 467 నుంచి 336 వరకు అనగా మౌర్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.
కళింగ దేశంపై దాడి చేసిన అశోకుడు చారిత్రక కళింగయుద్ధములో, లక్షలాది కాళింగ వీరుల రక్తపుటేరులను చూసి, క్రీ.పూ. 225లో పశ్చాత్తాపం పొంది బౌద్ధమతాన్ని ఈ ప్రాంతంలోనే స్వీకరించాడు. గంగరాజుల పాలనలో బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. జిల్లాలో ఈ మతాలకు చెందిన చారిత్రక ప్రదేశాలు శాలిహుండం, కళింగపట్నం, మహేంద్రగిరి, దంతవరపుకోట, సంగమయ్యకొండ మొదలైన ప్రదేశాలున్నాయి.
భువనేశ్వరము ఉదయగిరిలో ఖారవేలుని చే వ్రాయించబడిన హథిగుంపశాసనము ముఖ్యమైనది.
మౌర్య సామ్రాజ్యం పతనము చేసి, క్రీ.శ. 183లో ఖారవేలుడు శ్రీముఖలింగం రాజధానిగా తిరిగి కళింగ రాజ్యాన్ని స్థాపించాడు. 7వ శతాబ్దం వచ్చినంత వరకు కళింగ రాజధాని ముఖలింగంగానే పరిగణింపబడింది. ఖారవేలుని కాలములో శ్రీముఖలింగము ప్రముఖ జైన దేవాలయము, తదుపరి అది శైవాలయముగా మార్చబడింది
కళింగ ఖారవేలుని తరువాత ఆంధ్ర చక్రవర్తులైన శాతవాహనులు, కళింగదేశాన్ని జయించారు. శాతవాహనుల తరువాత కళింగ రాజ్యం విచ్ఛిన్నమై చిన్న చిన్న రాజ్యాలుగా మారాయి. క్రీ.శ. 343లో సముద్రగుప్తుడు దండెత్తి వచ్చిన కాలంలో కళింగదేశాన్ని నలుగురు రాజులు పరిపాలిస్తున్నారు. నాటి వాసిష్ఠులకు రాజధాని పిఠాపురమే.
శాలంకాయనుల ధాటికి తాళలేక శ్రీకాకుళం దగ్గర ఉన్న ‘సింగుపురానికి’ ఆ తర్వాత టెక్కలి వద్ద ఉన్న ‘వర్దమానపురానికి’ అక్కడ నుంచి పొందూరు వద్ద నున్న ‘సిరిపురానికి’ రాజధానులను మార్చుకున్నారు.
క్రీ.శ. 485లో విష్ణుకుండినులు దక్షిణ కళింగాన్ని జయించారు. శ్రీకాకుళం స్టేషన్‌కు సమీపంలో ఉన్న మునగాలవలస పక్కన ఉన్న ‘పురుషోత్తపురం’ దగ్గరున్న దంతపురాన్ని గంగ ప్రాంతము నుంచి వచ్చిన గాంగరాజులు రాజధానిగా చేసుకుని పరిపాలించారు.
అప్పటినుంచి క్రీ.శ. 1434లో ప్రతాపరుద్ర గజపతి పరిపాలనకు వచ్చినంత వరకు గంగరాజులే పరిపాలించారు.
గౌతమి బుద్ధుడు క్రీ.పూ. 483లో మరణించిన తర్వాత అంత్యక్రియలు జరిపించి ఆయన శరీర అవశేషాలను వివిధ ప్రాంతాలకు తీసుకుపోయారు.
బుద్ధుని నోటిలోని ఒక దంతాన్ని ఖేమరుసి అనే వ్యక్తి తీసుకువచ్చి కళింగరాజుల్లో ఒకడైన బ్రహ్మదత్తుని కాలంలో నరేంద్రపురం కోటలో పదిలపర్చాడు. క్రమంగా ఇక్కడ ఒక స్థూపం కూడా నిర్మితమై ఎన్నో పూజలందుకుంది. ఇదే కాలక్రమంలో దంతకోట, దంతపురంగా [శ్రీకాకుళము దగ్గరలోని నేటి "దంత"] మారిందని చెబుతారు. అది తదనంతరము కాళింగ ఆడపడుచుల ద్వారా కళింగ ఏలుబడిలోనున్న సింహళము[నేటి శ్రీలంక]కు తీసుకువెళ్లబడింది.
సింహళము[Ceylon] పేరు మరియు సింగపూర్ [Singapore] దేశము పేర్లు క్రీస్తు పూర్వము 5,6 శతాబ్దములలో సింహపురము [నేటి Srikakuam జిల్లాలోని సింగుపురము] పాలించిన "కళింగ సింహబాహు"ని వలననే , ఆయన కుమారుడు కళింగవిజయబాహు"ని సింహళదేశ పాలన, ప్రాబల్యము వలననే పిలువబడుతున్నాయి.
కళింగుల నావికా సమరప్రావీణ్యమునకు ప్రతీక కళింగపట్నము రేవు. వీరి ప్రాబల్యము తామ్రలిప్తి మొదలుకొని సింహళము, సింగపూర్, ఇండోనేషియా "బాలి"ద్వీపము వరకు వ్యాపించియున్నది.
బలి చక్రవర్తి సంతానమైన కళింగుడు, కళింగులు తమ వంశమూలపురుషుని పేరునే తమ పాలనలో "బలి" లేదా ""బాలి" [BALI] ద్వీపముగా పిలుచు చున్నారు. ఇండోనేషియాలో కళింగ ప్రోవిన్సు [Kalinga Province] ఉన్నది. అక్కడ గౌడ కళింగ
(GAWAD KALINGA) అని పిలువ బడుతున్నారు. కళింగుల మూలాలు గంగానదీపరివాహకము లోని గౌడదేశప్రాంతానివి.
గంగరాజులు కళింగాన్ని సుదీర్ఘమైన కాలం పరిపాలించారు. ఒక దశాబ్దం వరకు ‘ముఖలింగం’ రాజధానిగా చేసుకుని పరిపాలించిన తర్వాత కటకానికి రాజధానిని మార్చారు. వీరి హయాంలో శ్రీముఖలింగం, నగరికటకం అద్భుత నగరాలుగా ఉండేవి. శ్రీముఖలింగ ఆలయాలు వీరు నిర్మించినవే.
ఆనాటి సామాజిక జీవన స్థితిగతులు ముఖలింగం శిల్పాల్లో కనిపిస్తాయి. గంగ వంశానికి చెందిన 50 మంది రాజులు పరిపాలించినట్టు చరిత్రకారులు గుర్తించారు. వీరి శాసనాలు జర్జంగి, శ్రీకాకుళం, ఉర్లాం, అచ్యుతాపురం, సంతబొమ్మాళి, ఆమదాలవలస తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.
శ్రీముఖలింగం ఆలయంలోనే 149 శాసనాలున్నాయి. గంగరాజుల్లో ఒకడైన రెండవ వజ్రహస్త దేవుని శిల్పం ఇక్కడ కనిపిస్తుంది. ఈ వంశంలో చివరివాడు భానుదేవుడు.
గంగ వంశ పతనంతో ఆంధ్రదేశం మూడుభాగాలుగా విడిపోయింది. ఉత్తర కళింగాన్ని, క్రీ.శ. 1344లో పాలించిన కపిలేశ్వర గజపతికి ‘కటకం’ రాజధానిగా మారింది. అతని కుమారుడు పురుషోత్తమ గజపతి కళింగాన్ని జయించాడు.
ఉత్తర కళింగము ‘ఉత్కళం’గా మారిందని భాషాశాస్త్రవేత్తలు అంటారు. ఇతని కుమారుడు ప్రతాపరుద్రుని కాలంలో శ్రీకృష్ణ దేవరాయులు దండయాత్ర చేసి కళింగ సామ్రాజ్యం హస్తగతం చేసుకున్నాడు. నేటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఆ ‘నందపురం’లోనే ఉండేవి.
పర్లాకిమిడి రాజులు ఈ కాలంలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, మందస, నరసన్నపేట ప్రాంతాలను ఆక్రమించారు. జలంతరకోట, ఇచ్ఛాపురం, సోంపేట ప్రాంతాలు పాత్రునుల ఆధీనంలో ఉండిపోగా శ్రీకాకుళం, బొంతలకోడూరు ప్రాంతం మహ్మదీయ ప్రాబల్యంలోకి వెళ్లిపోయాయి.
నందవంశంలో క్రీ.శ.1752-58 కాలంలో లాలాకృష్ణుడు, విక్రమ్‌దేవ్‌ల మధ్యన పోరు జరిగి రాజ్యం విచ్ఛిన్నమైంది. నేటి ఒరిస్సా, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ‘జామీలు’గా ఏర్పడ్డాయి. పాలకొండ, వీరఘట్టాం కొత్త రాజ్యాలుగా అవతరించాయి. ఈ విభేదాలను ఆసరాగా చేసుకొని విజయనగరరాజు విజయరామరాజు విక్రమదేవునికి అండగా నిలిచి సాలూరు, కురుపాం, తదితర రాజ్యాలు పొందినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఔరంగజేబు గోల్కొండ నవాబును ఓడించి, నిజాం ఉల్‌ముల్క్‌ని తన ప్రతినిధిగా నియమించగా, ఔరంగజేబు మరణానంతరం నిజాం స్వతంత్రత ప్రకటించుకున్నాడు. అతని పరిపాలనలోనే ఆంధ్రప్రాంతం అయిదు సర్కారులుగా ముక్కలైంది.
నిజాం రాజు మరణానంతరం వారసత్వం కోసం చెలరేగిన అంతఃకలహాల్లో సలాబత్‌సింగ్‌ ఫ్రెంచ్‌ సేనాని బుస్సీ సహాయాన్ని కోరాడు. దీనితో శ్రీకాకుళం సర్కార్‌ నుంచి కొండపల్లి సర్కార్‌ వరకు నాలుగు సర్కారులను ఫ్రెంచివారు తమ సైనిక ఖర్చుల కింద రాయించుకున్నారు.
దీనివలన నైజాం ప్రతినిధి అయిన జార్‌ అలీ మహారాష్ట్రుల సహాయం కోరాడు. మహారాష్ట్ర సైనికులు చికాకోల్‌, విశాఖ, గోదావరి ప్రాంతాలను వశం చేసుకున్నారు. వారు వెళ్లిన తరువాత నిస్సహాయుడైన జాఫర్‌ అలీ మరణించాడు.క్రీ.శ. 1754లో చికాకోల్‌ ‘సుబా’ ఫ్రెంచివారి ఆధీనమైంది
విజయరామరాజు కోసం బొబ్బిలినిక్రీ.శ. 1757 జనవరి 26న ఫ్రెంచి సేనలు చుట్టుముట్టాయి. ఇతని హత్య తర్వాత రాజైన ఆనందగజపతి ఇంగ్లిషు వారితో చేతులు కలిపాడు. క్రీ.శ.1758లో ఇంగ్లిషు సైన్యం వచ్చింది. క్రీ.శ.1759లో ‘చికాకోల్‌’లో ‘ఫౌజ్‌దార్‌’ల పాలన అంతమైంది.
క్రీ.శ.1760లో ఆనందగజపతి చనిపోగా 1766లో ఈస్టిండియా పాలన ప్రారంభమైంది. అప్పటికి పాలకొండ, టెక్కలి మొదలైన జమిందారీలు ఉన్నాయి. 1778లో బ్రిటిష్‌వారితో జమిందారులు చేసుకున్న ఒప్పందం ప్రకారం క్రీ.శ.1801 నుంచి కలెక్టర్ల నియామకం ప్రారంభమైంది. 1816 నుంచి జిల్లా కలెక్టర్‌కు మెజిస్ట్రేట్‌ అధికారాలు లభించాయి.
జమీందారీ విధానాన్ని ఎదిరించిన గంజాం, విశాఖ జిల్లాల రైతుల వల్ల ‘అచ్చపువలస’ దగ్గర గిరిజన పితూరీ జరిగింది. ఈ గ్రామం వీరఘట్టాం దగ్గర ఉంది.క్రీ.శ. 1834లో గిరిజన తెగలకు చెందిన పాలకొండ, మేరంగి, కురుపాం, మొండెంఖల్‌లలో జమీందార్ల దోపిడీ ఎక్కువైంది. బ్రిటిష్‌వారు శ్రీకాకుళం, కశింకోటలను విశాఖలో విలీనం చేశారు.
ఇచ్ఛాపురాన్ని పాతగంజాంలో 1902లో కలిపారు.క్రీ.శ. 1902-1930 మధ్యలో జమీందారులు విపరీతంగా శిస్తులను పెంచారు. జమిందార్ల వ్యతిరేక పోరాటానికి 1940లో పలాసలో జరిగిన 2వ అఖిల భారత రైతు మహాసభ స్ఫూర్తినిచ్చింది. మందసలో జరిగిన రైతాంగ పోరాటంలో సాసుమాను గున్నమ్మ వీరమరణము చెందింది
క్రీ.శ.1948లో జమిందారీలను రద్దు చేసిన తర్వాత ఇచ్ఛాపురం, పార్వతీపురం, విజయనగరం సంస్థానాలన్నీ కలిపి విశాఖపట్నం అతిపెద్ద జిల్లాగా ఏర్పడింది. విశాఖ జిల్లా పెద్దదవడంతో పరిపాలనా పరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దానితో 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి జరిగిన సమావేశంలో [ఒరిస్సా రాష్ట్రములో మొదట ఉన్నప్పుడు గంజాము జిల్లా దక్షిణభాగముగాను, తదనంతరము మద్రాసు రాష్ట్రములో ఉన్నప్పుడు ఉత్తర విశాఖగాను పిలువబడే నేటి శ్రీకాకుళము ప్రాంతము] శ్రీకాకుళం షేక్‌అహ్మద్‌ కలెక్టర్‌గా నియమితులవడంతో కొత్త జిల్లాగా రూపుదిద్దుకుంది.
ఆనాడు పార్వతీపురము, బొబ్బిలి, గరివిడి 1978 లో విజయనగరము జిల్లా ప్రత్యేకముగా ఏర్పడేవరకూ శ్రీకాకుళము జిల్లాలోనే ఉండేవి.
ఇతర విశేషాలు....
జిల్లా ప్రధాన కేంద్రమైన శ్రీకాకుళం పట్టణం చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళానికి చేరువలోనున్న విమానాశ్రయం విశాఖపట్నం. సమీపంలోని రైల్వేస్టేషన్‌ ఆమదాలవలస స్టేషన్‌. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీకాకుళం పట్టణంలో ప్రాచీన ఆలయాల్లో శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం ఒకటి. ఏకాంత గణపతి పర్వతాకారులైన నందీశ్వరునితో అలరారుతోంది. ఈ ఆలయంలో 16, 17 శతాబ్దాల శాసనాలు లభించాయి. 
  

No comments:

Post a Comment